షాద్‌నగర్ (రంగారెడ్డి): పట్టణాభివృద్ధి, ప్రజా సౌకర్యాలే పరమావధిగా షాద్‌నగర్ కాంగ్రెస్ నాయకులు ఉదారత చాటుకున్నారు. షాద్‌నగర్ పట్టణంలో తీవ్రంగా వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, చౌరస్తా విస్తరణ పనులకు ఆటంకం కాకుండా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని స్వచ్ఛందంగా తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. ప్రజాహితం ముందని చాటుతూ విగ్రహాన్ని తొలగించేందుకు పూర్తి సహకారం అందించడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో విగ్రహాన్ని తొలగించే ప్రక్రియ చేపడుతుండగా, అనుకోకుండా వైఎస్సార్ విగ్రహం రెండు భాగాలుగా విరిగిపోయింది. తమ అభిమాన, ప్రజాదరణ పొందిన నాయకుడి విగ్రహం విరిగిపోవడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. విగ్రహం దెబ్బతినడం బాధాకరమైనప్పటికీ, పట్టణ ప్రజల ప్రయోజనాలు మరియు అభివృద్ధి పనుల కోసం తమ బాధను దిగమింగి నిర్ణయానికి కట్టుబడి నిలిచారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. "నాయకుడి విగ్రహం కంటే ఆయన ఆశయాలు, ప్రజలకు చేసే మేలే అత్యంత గొప్పవి. ప్రజలకు నిత్యం ఇబ్బంది కలిగించేలా విగ్రహం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాం" అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చాటిచెప్పిన కాంగ్రెస్ నాయకత్వ వైఖరిని స్థానికులు, వ్యాపారులు విశేషంగా అభినందిస్తున్నారు. ప్రజల అభివృద్ధే నాయకుడికి ఇచ్చే అసలైన నివాళి అని ఈ చర్య ద్వారా నిరూపించామని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి.


