కేశంపేట (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ), జూనియర్ కళాశాలలో కెఎల్ఆర్ (KLR) ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు నిర్వహించిన నైపుణ్య శిక్షణ తరగతుల ముగింపు ఉత్సవం బుధవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మహేశ్వరం కాంగ్రెస్ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు నైపుణ్య శిక్షణ, విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువత భవిష్యత్తు మరియు పురోగతి వారు ఆసక్తిగా అభ్యసించే చదువుపైనే ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ప్రతిరోజూ తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించే పాఠాలను అదే రోజు క్రమం తప్పకుండా పునశ్చరణ (రివిజన్) చేసుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
గురువుల మార్గదర్శకాలను క్రమం తప్పకుండా పాటిస్తూ, ప్రతి ఒక్కరూ నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. చదువు అనేది కేవలం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమగ్ర సమాజ అభివృద్ధికి తోడ్పడే ప్రధాన సాధనమని ఆయన అభిప్రాయపడ్డారు. శిక్షణ ముగింపు కార్యక్రమం అనంతరం కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విద్యార్థినులతో కలిసి పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి, వారిని అభినందించారు.


