షాద్‌నగర్ (రంగారెడ్డి): షాద్‌నగర్ పట్టణ ప్రధాన చౌరస్తా విస్తరణ మరియు అభివృద్ది పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని స్వచ్ఛందంగా తొలగించాలని కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన తర్వాత విగ్రహాన్ని మరో అనుకూలమైన ప్రదేశంలో గౌరవప్రదంగా పునఃప్రతిష్ఠించనున్నట్లు పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
పట్టణంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల నివారణకు మున్సిపల్, రెవెన్యూ, పోలీసు మరియు ఆర్‌అండ్‌బీ (R&B) శాఖల అధికారులు చౌరస్తా విస్తరణ పనులను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా చౌరస్తా పరిధిలో ఉన్న విగ్రహాలను స్వచ్ఛందంగా తొలగించాలని అధికారులు సంబంధిత రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చౌరస్తా పరిధిలోని అక్రమ ఆక్రమణలను తొలగించిన అధికారులు తదుపరి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. అధికారుల పిలుపునకు స్పందించి, అభివృద్ధికి సహకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుగా వైఎస్‌ఆర్ విగ్రహాన్ని తొలగించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని భావించింది.
ఇదే క్రమంలో చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ పలు ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను అధికారులకు వెల్లడించాయి. ఈ చౌరస్తాకు 'అంబేద్కర్ చౌరస్తా' అని పేరు పెట్టి, విస్తరణ పనులు పూర్తయిన అనంతరం విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని కోరారు. అయితే, రాకపోకలకు ఇబ్బంది లేకుండా అన్ని విగ్రహాలను సురక్షితంగా తొలగించి రహదారి విస్తరణ పూర్తి చేసిన అనంతరమే పునఃప్రతిష్ఠపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.


