బాలాపూర్: సమాజ సేవలో భాగస్వామ్యం అవుతూ బాలాపూర్ పరిధిలో మెకానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రపంచ మెకానిక్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెల్‌గూడ చందన చెరువు వద్ద ఆటో మొబైల్స్ అండ్ మెకానిక్స్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ (సంతోష్‌నగర్–చంపాపేట) ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటయింది.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు 67 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచిన కిరణ్ అనే యువకుడిని ఆమె ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.
అనంతరం చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ సమాజ సేవలో రక్తదానం అత్యున్నతమైనదని కొనియాడారు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న మెకానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులను ఆమె అభినందించారు.
ఈ సేవా కార్యక్రమంలో జీహెచ్ఎంసీ లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. వీరితో పాటు అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్, కమిటీ సభ్యులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


