వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో విషాదం నింపిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాంపల్లి ఇస్లాం నగర్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వలస కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ (ఆటో) వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
కూలీల వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన 17 మంది మహిళలు, ఆరుగురు పురుషులతో కూడిన కూలీల బృందం ఉపాధి నిమిత్తం తెలంగాణకు వలస వచ్చింది. వీరంతా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామం వద్ద తాత్కాలికంగా నివాసం ఉంటూ స్థానికంగా వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం పనులు ముగించుకుని మొత్తం 23 మంది కూలీలతో ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని వేములవాడ మార్గంలో వస్తున్న ఆర్టీసీ బస్సు డీకొట్టింది.
చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి
ఈ భీకర ప్రమాద దాటికి టాటా ఏస్ వాహనం తీవ్రంగా దెబ్బతినగా.. అందులో ప్రయాణిస్తున్న ఒకరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన 22 మందిని తక్షణమే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మరో ఇద్దరు కూలీలు కన్నుమూశారు. దీనితో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది.
ప్రస్తుతం మిగిలిన 20 మంది బాధితులు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. వ్యవసాయ పనుల కోసం వచ్చి రోడ్డు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో వలస కూలీల కుటుంబాలలో తీవ్ర శోకసముద్రం నెలకొంది. ఈ ఘటనపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


