హైదరాబాద్: సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ దసరా తర్వాత హైదరాబాద్లో రెండు లక్షల మందితో భారీ మార్చ్తో పాటు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దక్షిణాదిలో అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో సభలు నిర్వహించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. బుధవారం నాంపల్లిలోని గాంధీ భవన్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై, ప్రతిపక్షాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చేసిన తప్పిదాలు ఆధారాలతో సహా బయటపడుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తామంటే సహించేది లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశం ప్రమాదంలో పడిందని, సామాన్యులకు ఒరిగింది ఏమీ లేదని, కేవలం సంపన్నులకు మాత్రమే లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య మందిరానికి భూమి పూజ చేసింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని గుర్తుచేస్తూ, రాజకీయాల కోసం బీజేపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం కోసం సీరియస్గా కషడుతున్నామని, అక్టోబర్ 23న సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఎన్నికల సన్నాహక సమావేశం ఉంటుందని తెలిపారు. ఎర్రవల్లి భూముల వివాదంపై స్పందిస్తూ.. ఫాంహౌస్లపై దాడి చేయాలన్నది తమ అభిమతం కాదని, నీతిమంతులమని చెప్పుకుంటున్న వాళ్ల గురించి ప్రజలకు అసలు విషయాలు తెలియాలనే ఈ అంశం తెరపైకి వచ్చిందన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రతి దాన్ని రాజకీయం చేసి సెంటిమెంటును రెచ్చగొట్టి టైమ్ పాస్ చేశారని విమర్శించారు. కాగా, కష్టపడ్డవారందరికీ తగిన న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కార్పొరేషన్ పదవుల భర్తీ ఆలస్యం అవుతోందని, దసరా నాటికి వాటిని భర్తీ చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.


