హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల నివాస విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు కీలక ప్రకటన విడుదల చేసింది. విద్యా సంవత్సరం 2026-27 కు గాను గురుకుల ఇంటర్ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడానికి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
సొసైటీ పరిధిలోని ఇంటర్ ప్రవేశాల కోసం గతంలో అర్హత పరీక్ష (RJCCET-2026) నిర్వహించారు. దీని ఆధారంగా రెండు విడతల్లో ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా కొన్ని విద్యా సంస్థల్లో ఇంకా కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఈ ఖాళీలను భర్తీ చేయడం కోసం 2026 జూలై 6న జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా స్పాట్ కౌన్సెలింగ్ (Spot Counselling) నిర్వహించనున్నారు. అర్హత ఉండి సీటు సాధించలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను గురుకుల సొసైటీ కార్యదర్శి అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.


