హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉద్యోగ నియామక ప్రక్రియను ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా, దీనిపై ముఖ్యమంత్రి డీజీపీ సీవీ ఆనంద్ మరియు ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించేందుకు కొన్ని రాజకీయ పార్టీలతో పాటు స్వార్థ ప్రయోజనాలు ఆశించే ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నివేదికల ఆధారంగా స్పందించిన ముఖ్యమంత్రి, నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను నిష్పాక్షికంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు పరీక్షా కేంద్రాల భద్రత వరకు ప్రతి దశలోనూ పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
ముఖ్యంగా కోచింగ్ సెంటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థులను మోసగించే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు మరియు విద్వేషకరమైన సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నియామక ప్రక్రియ ముగిసే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ అత్యవసర సమీక్షా సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాస రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో పాటు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.


