హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు విద్యా, క్రీడా రంగాలలో గ్లోబల్ భాగస్వామ్యాలను నెలకొల్పే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబరు 10 మధ్య నాలుగు ప్రముఖ దేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), అమెరికా, జర్మనీ మరియు చైనా దేశాలను సందర్శించి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో విదేశీ పెట్టుబడులను సమీకరించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశాలలో ఒకటిగా ఉంది. దీంతో పాటు తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటు, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ శిక్షణ సంస్థలతో భాగస్వామ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆయా దేశాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి సలహాదారు కె.రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఏర్పాటైన స్కిల్స్ యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థల సహకారాన్ని అందించేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
విదేశీ పర్యటనకు ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అనుమతులు, రావాల్సిన నిధుల విడుదలపై చర్చించనున్నారు. అలాగే, ఈ నెల 16న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే వెసులుబాటు కల్పించాలనే అంశంపై కీలక తీర్మానం చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఒలింపిక్స్ సహా క్రీడల్లో పతకాలు సాధించేందుకు అవసరమైన శిక్షణ వ్యవస్థలను రూపొందించడంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో భాగంగా యూకే, అమెరికాలోని ప్రముఖ క్రీడా అకాడమీలను సందర్శించి అక్కడి విద్యా, శిక్షణా విధానాలను అధ్యయనం చేయనున్నారు. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు, విశ్వవిద్యాలయాల సహకారం ద్వారా తెలంగాణను విద్యా, నైపుణ్యం మరియు క్రీడల గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఈ విదేశీ పర్యటన దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.


