షాద్నగర్: శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా షాద్నగర్ పట్టణ పరిధిలోని పెద్ద జానంపేట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తి పారవశ్యంతో కొనసాగిన ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయంలో మండప పూజ, కుంకుమార్చన, హోమం, చండీ హోమం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను వేదమంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పూజా పూణ్యాల అనంతరం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలోనూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దంపతులు స్వయంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో భక్తిభావం, సేవాభావం, ఐక్యతను చాటిచెబుతున్నాయని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనిత రఘునాథ్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు చింటూ ప్రతాప్ రెడ్డి, యుగేందర్, నందకిషోర్, బచ్చలి నరసింహులు, జూపల్లి శంకర్, పాలమాకుల చెన్నయ్య, పోమాల్పల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి, కంటెస్టెడ్ కౌన్సిలర్లు నక్కల వెంకటేష్ గౌడ్, రాజేందర్ సింగ్, మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్, అడ్వకేట్ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ రాజు, నాయకులు అల్లాడ శేఖర్, ప్రభాకర్, దినేష్ సాగర్, శివ తదితరులు పాల్గొన్నారు.


