హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న తుమ్మల.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కేంద్రానికి సమగ్రంగా వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 315 మండలాల్లో తీవ్ర వర్షాభావం కారణంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సూక్ష్మ సేద్యం, మధ్యంతర పంటల విత్తనాల సరఫరా కోసం అదనపు బడ్జెట్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న, జొన్న సహా ప్రధాన పంటలను కనీస మద్దతు ధర (MSP)తో 100 శాతం కొనుగోలు చేయాలని, ధరల మద్దతు పథకం కింద ఉన్న 25 శాతం కొనుగోలు పరిమితి నిబంధనను తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. ఎరువుల ధరలు, సబ్సిడీలను హేతుబద్ధీకరించి రైతులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరారు.
ఉపాధి అవకాశాలు దెబ్బతిన్న గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఆర్థిక భరోసా కల్పించాలని తుమ్మల సూచించారు. బోర్వెల్ రీఛార్జ్ గుంతలు, ఫామ్ పాండ్లు, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో కరువు ప్రభావాన్ని అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. కేవలం అవగాహన సదస్సులు నిర్వహించడమే కాకుండా రైతులకు నేరుగా సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం నిర్వహించి, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు.


