న్యూఢిల్లీ / గురుగ్రామ్: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై విద్యార్థులకు మద్దతుగా 26 రోజులుగా సాగుతున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ నేరుగా పరామర్శించారు. మంత్రుల సమక్షంలో ఆయన తన దీక్షను అధికారికంగా విరమించారు.
మంత్రుల హామీతో దీక్ష విరమణ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముందస్తు చర్చలు జరిపిన అనంతరం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ మేదాంత ఆసుపత్రికి చేరుకున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి అంగ్మో సమక్షంలో ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం మంత్రులు స్వయంగా అందించిన కప్పు నుంచి నీటిని స్వీకరించి వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను ముగించారు.
జంతర్ మంతర్ నుంచి మేదాంత ఆసుపత్రి వరకు
విద్యావ్యవస్థలో పారదర్శక సంస్కరణలు తీసుకురావాలని , పేపర్ లీకేజీలపై జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా వాంగ్‌చుక్ ఈ దీక్షను ప్రారంభించారు. కాకరోచ్ జనతా పార్టీ (CJP) సభ్యులతో కలిసి ఆయన నిరసనలో పాల్గొన్నారు. అయితే రోజులు గడిచేకొద్దీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, వైద్యుల సలహా మేరకు ఆయనను మేదాంత ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఈ నిరసనకు తెరపడింది.


