శంషాబాద్: శంషాబాద్ జోన్ పరిధిలోని వివిధ కాలనీల్లో శ్రీ పోచమ్మ తల్లి బోనాల పండుగ ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. మధుర్‌నగర్, ఆర్బీ నగర్, ఆదర్శ్‌నగర్, పోచమ్మ బస్తి ప్రాంతాల్లోని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు

మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తలపై బోనాలు ఎత్తుకుని డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆయా దేవాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

కుటుంబ సుఖశాంతులకై ప్రత్యేక ప్రార్థనలు

అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కుటుంబ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. దేవాలయ కమిటీలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, క్యూలైన్ల ఏర్పాట్లు చేశాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 3 Aug 2026 | 09:58 PM IST
Tags: