షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారులపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మట్టితో గుంతల పూడ్చివేత
ప్రజల సమస్యను గుర్తించిన 26వ వార్డు కౌన్సిలర్ శివ ప్రత్యేక చొరవ తీసుకుని తాత్కాలిక మరమ్మతు పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు గుంతలు పడిన ప్రాంతాలలో మట్టిని వేయించి రోడ్డును వినియోగానికి అనువుగా తీర్చిదిద్దారు.
శాశ్వత పరిష్కారానికి కృషి
ఈ సందర్భంగా కౌన్సిలర్ శివ మాట్లాడుతూ.. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యల్లో భాగంగా ఈ తాత్కాలిక పనులు చేపట్టినట్లు తెలిపారు. దెబ్బతిన్న రహదారులకు శాశ్వత సీసీ లేదా బీటీ రోడ్లు నిర్మించేందుకు అవసరమైన నిధుల మంజూరు కోసం ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వర్షాలు తగ్గిన వెంటనే శాశ్వత పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని, అప్పటివరకు వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.


