షాద్‌నగర్: షాద్‌నగర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తా విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శనివారం విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రధాన కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు.

ప్రజా భద్రతే ముఖ్యం – వ్యాపారులకు విజ్ఞప్తి

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. చౌరస్తా వద్ద నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి వ్యక్తిగత ఆస్తులు, ప్రయోజనాల కంటే ప్రజల ప్రాణాలు, భద్రత ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తట్టుకోవాలన్నా, ప్రమాదాలను అరికట్టాలన్నా చౌరస్తా విస్తరణే ఏకైక మార్గమని చెప్పారు. పట్టణ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని భూ యజమానులు, స్థానిక వ్యాపారులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్ నిలిచివేత – పోలీసుల జోక్యం

విద్యార్థుల మానవహారంతో ప్రధాన కూడలిలో కొంతసేపు తీవ్ర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చౌరస్తా విస్తరణ ఉద్యమకారుడు ఆర్‌.ఎన్‌. రాముతో పాటు ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులతో పోలీసులు మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 1 Aug 2026 | 06:22 PM IST
Tags: