దిల్‌సుఖ్‌నగర్: విద్యార్థులను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.
క్షమాపణ చెప్పాల్సిందే
విద్యార్థులను "క్రిమినల్స్"తో పోల్చి మాట్లాడటం వారిని తీవ్రంగా అవమానించడమేనని బీజేవైఎం నేతలు మండిపడ్డారు. విద్యార్థి సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత – పోలీసు బందోబస్తు
బీజేవైఎం ఆందోళన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


