షాద్‌నగర్: షాద్‌నగర్ పట్టణంలో ఆక్రమణల నిరోధకం అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రధాన చౌరస్తా విస్తరణ పనులను సుగమం చేసేందుకు మున్సిపల్ అధికారులు ఇతర శాఖల సమన్వయంతో ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో రహదారిని ఆక్రమించి నిర్మించిన మెట్లు, డబ్బాలు, ఇతర తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశారు. అయితే అధికారులు వెళ్లిన రెండు రోజులకే ఆక్రమణదారులు మళ్లీ అవే ప్రదేశాల్లో నిర్మాణాలు చేపడుతుండటం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
వర్షాలను ఆసరాగా చేసుకుని ఆక్రమణలు
చౌరస్తా విస్తరణ పనులు వేగంగా జరుగుతున్న సమయంలో కురిసిన వర్షాల కారణంగా కూల్చివేతల కార్యక్రమానికి అధికారులు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న కొందరు వ్యాపారులు, స్థానిక ఆక్రమణదారులు రాత్రికి రాత్రే తిరిగి సిమెంట్ మెట్లు, నిర్మాణాలను చేపడుతున్నారు. ప్రజా ప్రయోజనాలు, రోడ్డు విస్తరణ కన్నా స్వప్రయోజనాలే ముఖ్యామనే ధోరణి ఆక్రమణదారుల్లో కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఒకవైపు విద్యార్థులు, ప్రజలు చౌరస్తా విస్తరణ కోసం పోరాడుతుంటే, మరోవైపు తొలగించిన ఆక్రమణలు స్వల్ప వ్యవధిలోనే మళ్లీ వెలవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కేవలం కూల్చివేసి వెళ్లడమే కాకుండా, నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. తిరిగి నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని, విస్తరణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


