షాద్‌నగర్: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని ఆరోపిస్తూ.. తక్షణమే కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో షాద్‌నగర్ ముఖ్య చౌరస్తాలో విద్యార్థులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో విజ్ఞాన్ కళాశాల బంక్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థులకు, రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కేటాయించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తమ గుప్పిట్లో పెట్టుకుని సుమారు 13 కోట్ల ఓట్లను చోరీకి గురిచేశారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ముఖ్యంగా ముస్లింలు, భాజపా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే వారి ఓట్లను తొలగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

గతంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ఏ విధంగా పోరాటాలు చేశారో, అదే రీతిలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. విద్యార్థినాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తెలంగాణ పోరాటాల గడ్డపై నుండి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Oct 2026 | 09:46 PM IST
Tags: