వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డిప్యూటీ ఈవో)గా ప్రతాప నవీన్ గురువారం ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డిప్యూటీ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను వేములవాడకు బదిలీ చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో వేములవాడ దేవస్థానం ప్రధాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) రమాదేవి ఆదేశాల మేరకు ప్రతాప నవీన్ ఆలయ పరిపాలనా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
రాజన్న చెంత ప్రత్యేక పూజలు
ఆలయ డిప్యూటీ ఈవోగా బాధ్యతలు చేపట్టే ముందు ప్రతాప నవీన్ కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు మహామండపంలో వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్‌కు వేములవాడ ఆలయ అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది మరియు ఆలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులకు కల్పించే సేవలలో, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో పూర్తి పారదర్శకతతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా నూతన డిప్యూటీ ఈవో ఆశాభావం వ్యక్తం చేశారు.


