హైదరాబాద్: జిల్లాలో ఎల్ నినో ప్రభావం మరియు తీవ్ర వర్షపాత లోటు వల్ల తలెత్తుతున్న పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమగ్ర సమీక్షా సమావేశం జరిగింది. సంక్షోభం తలెత్తిన తర్వాత స్పందించడం కాకుండా, అధికారులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండి, మిషన్ మోడ్‌లో పనిచేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నగర ప్రజలకు తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ ఉత్పాదన, ప్రజారోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
నీటి వృథాను అరికట్టాలి: మంత్రి అజహరుద్దీన్
ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ.. ప్రతి నీటి బొట్టూ అమూల్యమైనదని, నగరంలో ఎక్కడా లీకేజీలు, నీటి వృథా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సీజన్‌లో సాధారణం కంటే 42 శాతం వర్షపాత లోటు నమోదైనట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, కేవలం ప్రభుత్వ చర్యలకే పరిమితం కాకుండా భూగర్భ జలాల సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని, ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు.
సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం: కలెక్టర్ ప్రియాంక అలా
సమావేశంలో వెల్లడైన వివరాలు, మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు అందించిన విలువైన సూచనల ఆధారంగా జిల్లా యంత్రాంగం వేగంగా కదులుతోంది. నగరంలో తలెత్తే ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను (Action Plan) రూపొందిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా వెల్లడించారు. తాగునీటి ఎద్దడి రాకుండా, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేశారు.


