న్యూఢిల్లీ: పరీక్షల పేపర్ లీకేజీల చెక్ పెట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొస్తున్నట్లు నిన్న అర్థరాత్రి వేళ ప్రత్యేక సెల్ఫీ వీడియో ద్వారా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ, తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నిన్నటి వీడియోపై దేశ ప్రజలు చూపిన ఆదరణ, అందించిన సానుకూల సలహాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఈ వీడియోను పోస్ట్ చేశారు.
"మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" – మోదీ సందేశం
తాజా వీడియోలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ధన్యవాదాలు మిత్రులారా.. నిన్న రాత్రి ఆలస్యంగా మీతో అనుసంధానమయ్యే అవకాశం లభించింది. నేను పోస్ట్ చేసిన వీడియోపై మీరు ఎంతో సానుకూలంగా స్పందించి, మంచి సలహాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఈ ప్రేమాభిమానాలు ఇలాగే కొనసాగాలని, మన అనుబంధం మరింత క్రియాశీలంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన
పరీక్షల నిర్వహణ పారదర్శకత, పేపర్ లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు కోసం కేంద్ర కేబినెట్ బిల్లు తీసుకోస్తున్నట్లు ప్రధాని వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ వరసగా సోషల్ మీడియా వేదికగా ప్రజలతో నేరుగా సంభాషిస్తుండటంతో నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రధాని పిలుపుకు పెద్ద ఎత్తున ప్రతిస్పందనలు, సూచనలు వెల్లువెత్తుతున్నాయి.


