పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలను బీజేపీ నాయకులు ఆకస్మికంగా సందర్శించారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు ఆదేశాల మేరకు, మండల అధ్యక్షుడు దేశమోని పరుశురాముడు ఆధ్వర్యంలో నాయకులు కళాశాలకు వెళ్లి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మౌలిక వసతులు లేవు – విద్యార్థులకు ఇబ్బందులు

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కళాశాలలో సుమారు 215 మంది నిరుపేద విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, అయితే వారికి కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. సరిపడా తరగతి గదులు లేక, సైన్స్ ప్రయోగశాలల్లో పరికరాల కొరతతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. అలాగే కూర్చోవడానికి ఫర్నిచర్, మరుగుదొడ్ల సమస్యలతో పాటు MPHW కోర్సుకు సంబంధించి లేడీ టీచర్ పోస్టు ఖాళీగా ఉందనే విషయాన్ని గుర్తించారు.

సమస్యలు తీర్చకుంటే ఉద్యమం తప్పదు

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని, కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని విమర్శించారు. కళాశాల సమస్యలపై సంబంధిత ఉన్నతాధికారులకు త్వరలోనే వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల, గ్రామ స్థాయి సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 1 Aug 2026 | 06:49 PM IST
Tags: