నల్లగొండ: పశువుల నుండి మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా పశు వైద్యశాలలో ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జంతువుల ద్వారా రేబిస్, జపనీస్ ఎన్సెఫలైటిస్, బ్రుసెల్లోసిస్, బర్డ్ ఫ్లూ, లెప్టోస్పిరోసిస్,  టీనియాసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. పిచ్చికుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధి అత్యంత భయంకరమైనదని తెలిపారు.

మిర్యాలగూడ, దేవరకొండలో జంతు జనన నియంత్రణ కేంద్రాలు

కుక్కల జనాభాను అదుపు చేయడానికి పెంపుడు, వీధి కుక్కలకు జంతు జనన నియంత్రణ (ABC) శస్త్రచికిత్సలు చేయడం ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నల్లగొండలో జంతు జనన నియంత్రణ కేంద్రం సేవలందిస్తోంది. రాబోయే రోజుల్లో మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాలలో కూడా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

వర్షాకాలంలో కుక్కలు ఎక్కువగా ఆవేశానికి లోనవుతాయని, అందువల్ల విద్యార్థులలో అవగాహన పెంచాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయడం ఆపితే వీధి కుక్కలు గుంపులుగా చేరడాన్ని నివారించవచ్చన్నారు. కుక్కలకు వీధుల్లో కాకుండా ఇళ్లలోనే ఆహారం అందించాలని కోరారు. పెంపుడు కుక్కలకు స్థానిక సంస్థల ద్వారా లైసెన్సులు ఇవ్వడంతో పాటు, వీధి కుక్కలన్నింటికీ రేబిస్ నిరోధక టీకాలు వేయించాలని స్పష్టం చేశారు.

inline-img

210 కుక్కలకు రేబిస్ నిరోధక టీకాలు

ఈ నివారణ చర్యల్లో పశుసంవర్ధక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా పశు వైద్యశాలలో 210 కుక్కలకు ఉచితంగా రేబిస్ నిరోధక టీకాలు వేశారు. బలహీనంగా ఉన్న కుక్కలకు టానిక్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాహుల్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిశీలకులు శామ్యూల్ జాన్ పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ జి.వి. రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్లు, వెటర్నరీ రెసిడెంట్ సర్జన్లు, సిబ్బంది, జంతు ప్రేమికులు హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST