నల్లగొండ: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు పూర్తి స్థాయిలో సహకరించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ‘సర్’ ప్రక్రియపై ఆయన ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 లక్షల 16 వేల 253 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు.
100 శాతం లక్ష్యమే ధ్యేయం
ఓటరు జాబితా సవరణకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 15 లక్షల 12 వేల 548 ఎన్యుమరేషన్ ఫారాలను క్షేత్రస్థాయిలో పంపిణీ చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ వివరించారు. మిగిలిన ఫారాలను కూడా త్వరలోనే పంపిణీ పూర్తి చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. పంపిణీ చేసిన ఫారాలలో ఇప్పటివరకు సుమారు 33.58 శాతం ఫారాలను ఓటర్ల నుండి తిరిగి స్వీకరించామని, ఇంకా సుమారు 66 శాతం ఫారాలను సేకరించాల్సి ఉందని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు.
డబుల్ ఓట్ల తొలగింపునకు సహకరించాలి
ఓటరు జాబితా నమోదు, ఫారాలను ఎలా నింపాలనే అంశాలపై ఓటర్లకు, రాజకీయ పార్టీలకు ఉండే సందేహాలను నివృత్తి చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) సూచనల మేరకు 2002 ఓటరు జాబితాను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా సవరణకు సంబంధించి ఇప్పటివరకు 88 శాతం మ్యాపింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు.
ముఖ్యంగా జిల్లాలో మరణించిన వారి ఓట్లతో పాటు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న డబుల్ ఓట్లను (Double Votes) పూర్తిగా తొలగించి జవాబుదారీతనం పెంచేందుకు ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయిలో అధికారులకు సహకరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


