న్యూఢిల్లీ / వరంగల్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రతిపాదించిన మెగా లెదర్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. బుధవారం లోక్‌సభ సమావేశాలలో భాగంగా రూల్-377 కింద ఈ కీలక అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు సుదీర్ఘకాలంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఆమోదంలో జరుగుతున్న ఆలస్యం కారణంగా స్థానిక యువతకు లభించాల్సిన ఉపాధి అవకాశాలు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన 120 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ (టీఎస్‌ఎల్‌ఐపీసీఓ) ఆధ్వర్యంలో ఈ మెగా లెదర్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదికను రూపొందించింది. తెలంగాణలో చర్మ పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాల లభ్యత పుష్కలంగా ఉండటంతో పాటు ఎఫ్‌డీడీఐ, నిఫ్ట్, గిల్ట్ వంటి అంతర్జాతీయ స్థాయి నైపుణ్య, శిక్షణా సంస్థల సహకారం కూడా అందుబాటులో ఉందని లోక్‌సభ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మెగా లెదర్ పార్క్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఎంపీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి భూ సేకరణతో పాటు అన్ని ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయినప్పటికీ, కేంద్రం నుంచి తుది ఆమోదం రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని స్పష్టం చేశారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, జౌళి శాఖలను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు.


