హైదరాబాద్: బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతిని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుంచారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూదందాలు, హోటల్స్ బాగోతాలను ప్రభుత్వం బయటపెట్టిందని తెలిపారు. అయితే, తమ వాయిస్ను టాంపరింగ్ చేసి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా కేటీఆర్, బీఆర్ఎస్ నేతల తీరుపై ఎంపీ చామల కిరణ్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దాదాపు రూ. 8 లక్షల కోట్ల అప్పులపాలు చేసిందని ఆరోపించారు. 'ఏనుగు ఎక్కి ప్రగతి భవన్కు వెళ్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఫాంహౌస్కు పరిమితమయ్యారు' అని ఎద్దేవా చేశారు. అమెరికాలో ఆరేళ్లు ఉండి ఫైవ్ స్టార్ హోటల్ కట్టుకున్నానని కేటీఆర్ చెబుతుంటారని, అంతటి మేధావి అయిన కేటీఆర్ కుటుంబం పాలిస్తేనే రాష్ట్రం రూ. 8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా ఎలా మారిందని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సమాజం ముందు తప్పును కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు, ఆర్టిస్టులు చేస్తున్న డ్రామాలు ఇకనైనా బంద్ చేయాలని హితవు పలికారు.


