గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ర్యాలంపాడు ఆర్‌అండ్‌ఆర్ (R&R) సెంటర్‌లో బుధవారం పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ నూతనంగా నిర్మించిన పలు ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి వాకిటి శ్రీహరి ముంపు బాధితుల సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై భావోద్వేగంగా ప్రసంగించారు.

ర్యాలంపాడు గ్రామంలో పేదల సొంతింటి కలలను నిజం చేస్తూ ఒకేసారి 200కు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదృష్టం అందరికీ రాదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజలకు నిజమైన మేలు జరుగుతుందని చెప్పారు.

భూములు ఇచ్చిన త్యాగధనులు దేవుళ్లతో సమానం

ముంపు గ్రామాల ప్రజలు పడే బాధలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. "మా ప్రాంతంలో 2002, 2007, 2010 సంవత్సరాలలో భూములు కోల్పోయిన వేలాది కుటుంబాలు పరిహారం కోసం ఎంతోకాలం ఎదురుచూసి, చివరకు వలస వెళ్లాల్సిన దుర్భర పరిస్థితులు వచ్చాయి. ఇతరుల అభివృద్ధి కోసం తమ భూములను ఉదారంగా ఇచ్చే ముంపు గ్రామాల ప్రజలు దేవుళ్లతో సమానం. అలంపూర్ ప్రాంతానికి శాశ్వత ప్రయోజనం చేకూరడం కోసమే 13 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అలాంటప్పుడు త్యాగం చేసిన కుటుంబాలకు న్యాయం చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత" అని స్పష్టం చేశారు. ఆర్‌అండ్‌ఆర్ చట్టం ప్రకారం నిర్వాసితులందరికీ తగిన పరిహారం అందించి తీరుతామన్నారు.

పేదవాడి ఆకలి తెలిసిన ప్రభుత్వం

రాష్ట్రంలో గుడిసెలు లేకుండా చేయాలనే బలమైన సంకల్పంతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణానికి రూ.175 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని, అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా బిల్లులు విడుదల చేస్తుండటమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

నాడు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి అదే సేవా భావనతో పనిచేస్తున్నారని గుర్తుచేశారు. పేదవాడి ఆకలి తెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీ మరియు పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి చారిత్రాత్మక పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి సన్నబియ్యం పథకం లేదన్నారు. తాను 30 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తూ కార్యకర్తగా ఉన్నానని, ప్రభుత్వం చేస్తున్న ఈ అభివృద్ధిని ప్రజలు ఎన్నటికీ మరువద్దని పిలుపునిచ్చారు.

ఈ ప్రతిష్టాత్మక ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, టీజీఎస్‌జీడీసీఎఫ్ (TGSGDCF) చైర్మన్ సరిత యాదవ్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST