హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై తెలంగాణ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సంబంధిత కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మిల్లుల నిర్మాణంపై తుమ్మల ఆరా
ఈ సమావేశంలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పురోగతి, కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యాలు, రైతులకు అందుతున్న మద్దతు సేవలతో పాటు ప్రాసెసింగ్ మిల్లుల నిర్మాణ పనులపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీల నిర్వాహకులను ఆదేశించారు.
లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
రైతులకు నూతన సాగు పద్ధతులు, సబ్సిడీలు, సాంకేతిక సహకారం అందించడంలో కంపెనీలు చొరవ చూపాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సాగు విస్తరణ లక్ష్యాలను కంపెనీలు తప్పనిసరిగా సాధించాలని తేల్చి చెప్పారు. లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహించినా, రైతులకు సేవలు అందించడంలో విఫలమైనా సంబంధిత కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వివిధ ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు, పరిశోధనా విభాగం అధికారులు పాల్గొన్నారు.


