మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను, వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన చౌరస్తా, రద్దీగా ఉండే వీధులు, నివాస కాలనీలలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై పడేందుకు యత్నిస్తున్నాయి.
భయంతో కిందపడుతున్న బైకర్లు
ప్రధాన చౌరస్తా మీదుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులను కుక్కలు ఒక్కసారిగా వెంటాడుతున్నాయి. వేగంగా వెళ్లే వాహనాల వెనుక కుక్కలు పరుగులు తీస్తుండటంతో, భయపడిన వాహనదారులు అదుపు తప్పి కిందపడి గాయపడుతున్న ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల విద్యార్థులు, వృద్ధులకు తప్పని తిప్పలు
ఉదయం వేళల్లో పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలు, కాలినడకన వెళ్లే మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు అడుగు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి దాపురించింది. కుక్కలు ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తాయో తెలియక ప్రజలు చేతిలో కర్రలతో అప్రమత్తంగా వెళ్లాల్సి వస్తోంది.
అధికారులు స్పందించాలి
ఈ సమస్యపై పలుమార్లు పంచాయతీ, సంబంధిత అధికారులకు విన్నవించినా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక డ్రైవ్ ద్వారా వీధి కుక్కలను పట్టుకుని డాగ్ షెల్టర్లకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణాలు, జనసంచారం ఎక్కువ ఉండే ప్రధాన ప్రాంతాలలో పారిశుధ్య, సంబంధిత సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


