మహేశ్వరం: మహేశ్వరం మండలంలోని గ్రామాల్లో నెలకొన్న ప్రాథమిక సమస్యలు, అభివృద్ధి పనుల ప్రగతిపై శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మండల స్పెషల్ ఆఫీసర్ ఎన్. శుభాషిణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని విస్తృతంగా చర్చించారు.
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సర్పంచులు
ఈ సమావేశంలో మండల పరిధిలోని గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లోని ప్రధాన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో అధికారుల ముందుకు ఉంచారు. గ్రామీణ రహదారుల దుస్థితి, తాగునీటి సరఫరాలో అంతరాయాలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ, భూ రెవెన్యూ చిక్కులు, మొక్కల పెంపకం (హరితహారం), పాఠశాలల్లో మౌలిక వసతులు, బెల్ట్ షాపులు-మద్యపాన నియంత్రణ, భద్రత కొరకు సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.
పరిష్కారానికి అధికారుల హామీ
సర్పంచులు ప్రస్తావించిన అంశాలపై స్పందించిన అధికారులు ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని వివరించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి, సర్పంచులు తెలిపిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఎంపీడీఓ ఎన్. శారదమ్మ, డీఎల్‌పీఓ సామీ రెడ్డి, తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ సభావత్ కృష్ణ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, మండలంలోని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


