కొందుర్గు: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మితో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికంగా చేయూతనందించే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తత
అనంతరం రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే.. ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున అన్నదాతలు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రాంతీయ పరిస్థితులకు తగినట్లుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పంటల ఎంపికలో వ్యవసాయ నిపుణులు మరియు అధికారుల సలహాలు పాటిస్తే నష్టాలను తగ్గించుకుని లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ అజం అలీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోగూరి పురుషోత్తం రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జితేందర్, దామోదర్ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, మల్లేష్ గౌడ్, బ్యాటరి కృష్ణారెడ్డి, రాములు గౌడ్, కేకే కృష్ణ, సర్పంచ్‌లు విక్రమ్, అంజి, రాజ్‌కుమార్, రమేష్, ప్రభాకర్, అశోక్, యాదయ్య, మల్లయ్య, రామస్వామి, మనయ్య, నర్సింలు, గోపాల్, రాజేందర్ గౌడ్, జంగయ్య, జిపిఓలు హరీష్, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


