inline-img

మహేశ్వరం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గానికి ఆర్థిక సాయం విడుదల చేసింది. నియోజకవర్గ పరిధిలోని 43 దేవాలయాల అభివృద్ధి, ఉత్సవ నిర్వహణ కోసం రూ.17.63 లక్షల విలువైన చెక్కులను ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీల చైర్మన్లకు అందజేశారు. జిల్లెలగూడలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.

తెలంగాణ సంస్కృతికి బోనాలు ప్రతీక – జి. చిన్నారెడ్డి

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగ కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేస్తుందని అన్నారు. గ్రామదేవతలపై ప్రజలకు ఉన్న అపారమైన భక్తి ప్రపత్తులకు ఈ ఉత్సవాలే నిదర్శనమని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసేందుకే ప్రభుత్వం నేరుగా ఆలయ కమిటీలకు ఆర్థిక ప్రోత్సాహకం ఇస్తోందని వివరించారు.

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దేవాలయాల పునర్నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఉత్సవాలను వైభవంగా జరుపుకునేలా ప్రతి ఏటా ఆలయాలకు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని తెలిపారు.

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఏఐఎఫ్‌డీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బడంగ్‌పేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డితో పాటు వివిధ ఆలయ కమిటీల ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 1 Aug 2026 | 06:32 PM IST
Tags: