కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా మున్సిపల్ కౌన్సిలర్ జూపల్లి అన్వర్ వేగవంతమైన చర్యలు చేపట్టారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, వీధి లైట్ల సమస్యలపై ఆయన తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు.
ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డులో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా, పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా దెబ్బతిన్న డ్రైనేజీ కాల్వలకు వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టించారు. మురుగునీటి పారుదల సజావుగా సాగేలా సిబ్బందితో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడమే కాకుండా, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు, వార్డులో కాలినపోయిన, పనిచేయని వీధి లైట్లను గుర్తించి వెంటనే రిపేరు చేయించారు. చీకటిగా ఉండే ప్రధాన వీధులు, అవసరమైన ప్రాంతాల్లో కొత్త వీధి లైట్లను ఏర్పాటు చేయించి రాత్రి వేళల్లో ప్రజలకు, వాహనదారులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించారు. ప్రతి సమస్యకు తక్షణమే స్పందిస్తూ, వార్డు సమగ్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న కౌన్సిలర్ జూపల్లి అన్వర్ చొరవను 8వ వార్డు ప్రజలు విశేషంగా అభినందిస్తున్నారు.


