న్యూఢిల్లీ: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోగ్య సమస్యలపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీ వేదికగా గళమెత్తారు. ఈ సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను పార్లమెంట్ ప్రాంగణంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ ఈటల, డంపింగ్ యార్డ్ బాధితుల ఆవేదనను వెల్లడించారు.

హైదరాబాద్ జనాభా కేవలం 30 లక్షలు ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌లోనే.. నేడు నగరం 2 కోట్లకు పైగా జనాభాతో విస్తరించినా చెత్తనంతటినీ వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యం దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వచ్చి చేరడంతో అది కొండలా మారి 40 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని, సంపాదించిన సొంత డబ్బంతా ఆసుపత్రుల పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జవహర్ నగర్‌లో ఒక్క కిలో చెత్త కూడా పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి, 'జీరో పొల్యూషన్' పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయాలని కోరినట్లు తెలిపారు.

దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, ఢిల్లీ వంటి మహానగరాల్లో అనుసరిస్తున్న ఆధునిక చెత్త నిర్వహణ (వేస్ట్ మేనేజ్‌మెంట్) విధానాలను హైదరాబాద్‌లోనూ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఈటల రాజేందర్ వివరించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కెపాసిటీ కేవలం 3,500 మెట్రిక్ టన్నులేనని, అది సరిగ్గా పనిచేస్తోందో లేదో పర్యవేక్షించే నాథుడే లేడని విమర్శించారు. గతంలో ఈ సమస్యపై తాను, అలాగే ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆయన సీఎం అయినా ప్రజల రాత మారలేదని ఈటల విమర్శించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 5 Aug 2026 | 07:03 PM IST
Tags: