షాద్‌నగర్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, పారదర్శకమైన ఓటర్ల జాబితాల రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని షాద్‌నగర్ ఆర్డీవో, నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ERO) ఎన్ఆర్ సరిత పిలుపునిచ్చారు. షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఉదయం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డబుల్ ఓటర్లకు (ASD) సంబంధించిన జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రత్యక్షంగా అందజేయడంతో పాటు, వారి అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో కూడా పంచుకున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ (Rationalization) అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల సౌకర్యార్థం నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చేపడుతున్న ప్రతిపాదనలను వివరించారు. ఇందులో భాగంగా కేశంపేట మండలంలో రెండు కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న నాలుగు ప్రాంతాలకు సంబంధించి కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రతిపాదించారు. అలాగే చౌదర్‌గూడ, కొత్తూరు మండలాల్లో ఓటర్ల సంఖ్య 1,200 దాటినందున ఒక్కో కొత్త పోలింగ్ స్టేషన్‌ను, ఫరూక్నగర్ మండలంలో దూర భారాన్ని తగ్గించేందుకు మరొక కొత్త పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో చర్చించిన ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు మరియు పోలింగ్ స్టేషన్ల మార్పుల సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరవేసేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సహకరించాలని ఆర్డీవో సరిత విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.


