హైదరాబాద్: కాచిగూడలో నిర్వహించిన ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ ప్రత్యక్ష ప్రసారాన్ని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో వర్షపాతం తగ్గుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని, నీటి సంరక్షణ ఉద్యమంలో స్థానిక యువత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తిరంగా యాత్రలు.. మట్టి వినాయకుల పూజ
రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందు నుంచే ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగరవేయాలని, 'తిరంగా యాత్రలు' ఘనంగా నిర్వహించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం రానున్న వినాయక చతుర్థికి రసాయనాలు లేని మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని కోరారు.
కార్గిల్ వీరుల స్మరణ
'కార్గిల్ విజయ్ దివస్' సందర్భంగా దేశ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న ఆయన, ప్రతి నెలా చివరి ఆదివారం కుటుంబ సమేతంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించి ఒక పండుగలా జరుపుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.


