కొల్లాపూర్: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణే ధ్యేయంగా ఎన్మనబెట్ల గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. గ్రామంలోని 10వ వార్డు పరిధిలో అలివేల మంచాల పెద్ద వెంకటయ్య వార్డులో చేపట్టిన 97 మీటర్ల అండర్ డ్రైనేజీ (యుడీఆర్) నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. పూర్తి చేసుకున్న ఈ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యం
గ్రామంలో పారిశుద్ధ్య లోపాన్ని నివారించి, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు. ప్రజా ఆరోగ్యం, మెరుగైన జీవన వాతావరణాన్ని అందించేందుకు సర్పంచ్ సింధుజ సురేందర్ రావు చూపిన ప్రత్యేక శ్రద్ధ, చొరవను వార్డు ప్రజలు, గ్రామస్తులు కొనియాడారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఈ సందర్భంగా ప్రతి వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి, ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు గ్రామ పంచాయతీ ప్రతినిధులు తెలిపారు. ఎన్మనబెట్లను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా నిరంతరం కృషి చేస్తామని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు.


