మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఆకన్‌పల్లి గ్రామ పరిధిలో ఆదివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక చింతలకుంట చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.

జీవనోపాధి కోసం వచ్చి ప్రమాదానికి గురై..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా జండ్రపేట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మల్లవరపు సంజయ్ (38) గా గుర్తించారు. జీవనోపాధి కోసం ఆకన్‌పల్లి గ్రామంలో నివాసముంటున్న తన సోదరి యేసమ్మ ఇంటికి సంజయ్ మూడు రోజుల క్రితం వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం చేపల వేట కోసం సమీపంలోని చింతలకుంట చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.

కేసు నమోదు – విచారణ

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీటి నుంచి వెలికితీశారు. అనంతరం ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుడు సంజయ్‌కు చిన్నప్పటి నుంచి ఫిట్స్ (మూర్ఛ) వచ్చే సమస్య ఉందని, వేటకు వెళ్లిన సమయంలో ఫిట్స్ వచ్చి నీటిలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 2 Aug 2026 | 08:30 PM IST
Tags: