కొల్లాపూర్: ఎన్మన్ బెట్ల గ్రామంలోని వీరమనాయిని చెరువుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులకు మద్దతుగా నాయకుడు ఎల్లేని సుధాకర్ రావు వినూత్న నిరసనకు దిగారు. గ్రామ రైతులతో కలసి చెరువు నీటిలోనే 24 గంటల నిరసన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రైతులు ఎల్లేని సుధాకర్ రావుకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు.

ప్రభుత్వ వైఖరిపై ఎల్లేని సుధాకర్ రావు విమర్శలు

దీక్ష సందర్భంగా ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ.. రైతు బిడ్డగా రైతుల కష్టాలను స్వయంగా ఎరిగిన వ్యక్తిగా మద్దతుగా వచ్చానని తెలిపారు. వీరమనాయిని చెరువుకు సాగునీరు అందించే వరకు పోరాటం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతకు కనీసం సాగునీరు అందించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒక రోజు ఉపవాస దీక్ష కొనసాగిస్తానని వెల్లడించారు.

ఐక్యపోరాటానికి పిలుపు

ప్రతి సెంటు భూమికి సాగునీరు పారిస్తామని హామీ ఇచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్మన్ బెట్ల రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ఎల్లేని ప్రశ్నించారు. కొల్లాపూర్ ప్రాంతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందిస్తున్నప్పటికీ, స్థానిక పంట పొలాలకు నీరు ఇవ్వలేకపోవడం గమనార్హమన్నారు. హక్కుల సాధన కోసం రైతులందరూ ఐక్యంగా ఉద్యమించాలని, ఆ పోరాటంలో తాను ముందుంటానని పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Jul 2026 | 10:22 PM IST
Tags: