హైదరాబాద్: రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ఏ పేదవాడికీ, ఏ నిజమైన భూహక్కుదారుడికీ అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన వారి హక్కులను కాపాడుతూనే, ప్రభుత్వ భూములను పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన కథనాలు, ప్రజల ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉమ్మడి హైదరాబాద్ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. వివాదాలు లేని ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.

తహసీల్దార్, ఆర్డీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలో వచ్చే ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. 'ప్రజావాణి'లో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా 22ఏ భూముల వివాదాల పరిష్కారానికి సంబంధించి హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ భూములపై అక్రమ లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 5 Aug 2026 | 07:00 PM IST
Tags: