న్యూఢిల్లీ / హైదరాబాద్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆమె ఈ సమస్యను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్లాంట్ తరలింపుపై సమగ్ర వినతిపత్రం అందజేశారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం. 641 (తేదీ: 02-07-2026) ద్వారా సిద్ధాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 252, 278, 361లలో గల 86 ఎకరాల భూమిని జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ స్థలంలో 'హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (HiMSM)' ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం సరైనది కాదని పేర్కొన్నారు. గతంలో ఇదే భూమిని ఇకో-టౌన్ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన విషయాన్ని ఎంపీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ ప్రతిపాదిత వ్యర్థాల ప్లాంట్ చుట్టుపక్కల దాదాపు 50 గ్రామాలు జీవో ఎంఎస్ నెం. 111 (1996) పరిధిలోకి వస్తాయని డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ జీవో నిబంధనల ప్రకారం హైదరాబాద్ తాగునీటి మూలాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి కాలుష్య కారక పరిశ్రమలు లేదా వ్యర్థాల ప్లాంట్లు ఏర్పాటు చేయకూడదు. ఇక్కడ డంపింగ్ యార్డ్ ప్రారంభిస్తే భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమై ప్రజల తాగునీరు, ఆరోగ్యం మరియు జీవనోపాధి దెబ్బతింటాయని స్థానికులు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్నారని వివరించారు.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ (2016) మరియు ఈఐఏ (EIA) నోటిఫికేషన్ (2006) నిబంధనల ప్రకారం ఈ ప్లాంట్ ఏర్పాటుపై పునఃసమీక్ష జరపాలని ఎంపీ అరుణ విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజల అభ్యంతరాలను స్వయంగా పరిశీలించడానికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తో ప్రత్యేక తనిఖీ కమిటీని ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.


