భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని చంద్రుగొండ మండల కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో సాగుతున్న పలు అభివృద్ధి పనులు, ప్రభుత్వ విద్యాసంస్థల తీరును ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ (Land Acquisition) సర్వే పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, రైతులకు నష్టపరిహారం చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ఓటరు సవరణ కేంద్రాళ్ల పరిశీలన

అనంతరం మండలంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బూత్ స్థాయి అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. జూలై 24తో గడువు ముగుస్తున్నందున తప్పుల సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

స్కూల్ లంచ్ మెనూపై కలెక్టర్ అసంతృప్తి

ఈ పర్యటనలో భాగంగా చంద్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను (ZPHS) కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన, దాని నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన క్యాలెండర్ మెనూ ప్రకారం విద్యార్థులకు ఖచ్చితంగా పోషకాహారం అందించాల్సిందేనని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు.

పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని, ఉపాధ్యాయుల విద్యా ప్రగతి రికార్డులను సమీక్షించిన కలెక్టర్.. కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి శారీరక దారుఢ్యం కోసం ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 14 Jul 2026 | 05:03 PM IST
Tags: