బడంగ్‌పేట్: మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ పరిధిలోని నాదర్‌గుల్ ప్రాంతంలో రోహింగ్యాల అంశంపై నెలకొన్న వివాదం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా పోలీసులు రంగంలోకి దిగారు.
ఎంబీటీ (MBT) అధ్యక్షుడు అమ్జద్ ఉల్లా ఖాన్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆయన నివాసానికి వెళ్లేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు చర్యగా అందెల శ్రీరాములును అదుపులోకి తీసుకున్నారు.
ఈ సమాచారం అందిన వెంటనే బీజేపీ నాయకులు, కార్యకర్తలు నాదర్‌గుల్ పరిసర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. నాదర్‌గుల్, బడంగ్‌పేట్ లోని కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మరోవైపు ఈ ముందస్తు అరెస్టును ప్రతిపక్ష శ్రేణులు తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్యగా విమర్శించాయి. శాంతియుత వాతావరణాన్ని కాపాడటానికి, ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.


