ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘విబీ జి రాంజి’ (VBG Ramji) విధివిధానాల అమలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి దత్తారావు ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంత కూలీలకు మరింత లబ్ధి చేకూరడమే కాకుండా.. గ్రామాల మౌలిక వసతులు ఎంతగానో మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పథకం అమలు తీరుపై జిల్లా యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పెరిగిన పనుల సంఖ్య - 125 రోజులకు కూలి దినాలు
నూతన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఉపాధి హామీ పనుల పరిధిని ప్రభుత్వం మరింత విస్తరించిందని డీఆర్డీఓ దత్తారావు వివరించారు. గతంలో జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద 266 రకాల పనులను మాత్రమే గుర్తించగా.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆ సంఖ్యను ఏకంగా 318కి పెంచినట్లు వెల్లడించారు.
దీనితో పాటు ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. గతంలో ఉన్న ఉపాధి హామీ పని దినాలను ఇప్పుడు ఏకంగా 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. అలాగే రోజువారీ కూలి రేటును కూడా అదనంగా ఒక రూపాయి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు.
ఉపాధి హామీ పరిధిలోకి భవనాల నిర్మాణాలు, మరమ్మతులు
గతంలో ఉపాధి హామీ అంటే కేవలం మట్టి పనులకే పరిమితమనే భావన ఉండేదని, కానీ ఈ సరికొత్త విధానంలో మట్టి పనులతో పాటు గ్రామీణ ప్రాంతాలలో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు డీఆర్డీఓ తెలిపారు. ఇందులో భాగంగా.. గ్రామాలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ భవనాల (గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు తదితర) నిర్మాణాలు, పాత ప్రభుత్వ భవనాల మరమ్మతులు, స్థానిక చెరువులు మరియు సాగునీటి కాలువల తవ్వకం లాంటి పనులను కూడా ఈ పథకానికి జోడించినట్లు స్పష్టం చేశారు.
జిల్లాలో ఈ నూతన వ్యవస్థను పకడ్బందీగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా అమలు చేయడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని దత్తారావు వివరించారు. అర్హులైన కూలీలందరూ ఈ పొడిగించిన పని దినాలను, నూతన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


