హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాలు, ఇతర పరిపాలనా పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారీగా బియ్యం, గోధుమల కేటాయింపు

హైదరాబాద్ జిల్లా పరిధిలోని మొత్తం 8,43,607  రేషన్ కార్డుదారులకు కావలసిన నిల్వలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. దీనికోసం 59,602.822 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,279.513 మెట్రిక్ టన్నుల గోధుమలను సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం బియ్యాన్ని పూర్తిగా ఉచితంగా పంపిణీ చేస్తుండగా, గోధుమలను కిలో రూ.7 చొప్పున అందజేయనున్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రేషన్ దుకాణాల్లో సరుకులు తీసుకోవచ్చని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి ప్రకటనలో తెలిపారు.

ఆగస్టు 31 వరకు e-KYC పొడిగింపు

మరొకవైపు రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ గడువును కూడా అధికారులు పొడిగించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్డ్ లబ్ధిదారులందరూ ఆగస్టు 31వ తేదీలోగా తమ సమీపంలోని రేషన్ షాపులకు వెళ్లి వేలిముద్రలు (బయోమెట్రిక్) వేసి ఈ-కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 31 Jul 2026 | 09:56 AM IST
Tags: