హైదరాబాద్: "మానవత్వం మాటల్లో కాదు.. ఇచ్చే అవకాశాల్లో కనిపించాలి" అనే సంకల్పంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ట్రాన్స్‌జెండర్ సమాజానికి కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం చేయకుండా, వారిని నేరుగా పాలనలో భాగస్వాములను చేసేందుకు స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించే ప్రక్రియకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వివిధ ట్రాన్స్‌జెండర్ సంఘాల ప్రతినిధులు, హక్కుల ఉద్యమకారులు, హిజ్రా సంస్కృతి గురువులతో కూడిన సుమారు 25 మంది ప్రతినిధి బృందం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
రాజకీయ సాధికారతకు సరికొత్త నాంది - మంత్రి అడ్లూరి
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి, రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు.
పాలనలో స్వరం: స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా రావడం ద్వారా గ్రామాలు, మండలాలు, పట్టణాల అభివృద్ధి ప్రణాళికల్లో ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులు తమ స్వరాన్ని వినిపించే అవకాశం లభిస్తుందన్నారు.
మల్టీ-సెక్టార్ ఉపాధి: ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు డ్రైవింగ్, వంట, డ్రోన్ నిర్వహణ వంటి రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని గుర్తుచేశారు.
గౌరవప్రదమైన జీవనం: హైదరాబాద్ మెట్రో స్టేషన్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ (ట్రాఫిక్ వాలంటీర్లు)లో కూడా వారి సేవలను వినియోగిస్తూ గౌరవప్రదమైన జీవనోపాధి కల్పిస్తున్నామని, ఇప్పుడు రాజకీయ సాధికారత కల్పించడం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రతినిధులు
సమాజంలో కనీస గుర్తింపునకు నోచుకోని తమకు, స్థానిక సంస్థల్లో గౌరవప్రదమైన రాజకీయ స్థానం కల్పించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారని ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. సమాజాభివృద్ధిలో తాము మరింత బాధ్యతతో భాగస్వాములమవుతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.


