శంషాబాద్: శంషాబాద్ పరిధిలోని బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ పరిధిలోని సాతంరాయ్ వద్ద బస్సు కోసం బస్ స్టాప్‌లో వేచి చూస్తున్న ప్రయాణికులపైకి ఒక బొలెరో వాహనం వేగంగా దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ భయంకరమైన దుర్ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. బిన్నీల లోడుతో ఉన్న ఒక బొలెరో వాహనం శంషాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళుతోంది. ఈ క్రమంలో వాహనం సాతంరాయ్ వద్దకు రాగానే, ఓ ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయబోయింది. ఆ సమయంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిన బొలెరో వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. దురదృష్టవశాత్తూ వాహనం బోల్తా పడిన ప్రదేశంలోనే ఆర్టీసీ బస్ స్టాప్ ఉంది. దాంతో బస్సు కోసం అక్కడ వేచి ఉన్న జనాలపై ఆ లోడు వాహనం పడింది. ఈ ప్రమాదంలో సాతంరాయ్ గ్రామానికి చెందిన సుమ, సువర్ణ అనే ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతకాలా? - స్థానికుల ఆవేదన

ఈ ప్రమాదంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాతంరాయ్ వద్ద నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉంటారని, కానీ ఇక్కడ వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఎలాంటి బారికేడ్లు (భారీ గేట్లు) లేవని మండిపడుతున్నారు. ఇక్కడ రోడ్డు దాటాలన్నా, బస్ స్టాప్‌లో నిలబడాలన్నా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వాహనాలు నెమ్మదిగా వెళ్లేలా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలని లేదా ట్రాఫిక్ పోలీసులను నియమించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Updated: 10 Jul 2026 | 12:46 PM IST