షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఘోర వైద్య నిర్లక్ష్య ఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడి తప్పుడు వైద్యం, నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ కోమాలోకి జారుకుని, చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు అటు సంబంధిత ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట, ఇటు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏకకాలంలో భారీ ఆందోళనకు దిగడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

చేతి నొప్పికి వెళ్తే.. గర్భసంచి ఆపరేషన్!

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన బిజ్జ సుజాత అనే మహిళ కొంతకాలంగా చేతి నొప్పితో బాధపడుతోంది. చికిత్స నిమిత్తం ఆమె పట్టణంలోని జీహెచ్ఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఒక ప్రముఖ ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ దవాఖానలో చేరింది. అయితే, అక్కడ ఆమెకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గర్భసంచిలో తీవ్ర సమస్య ఉందని, అందులో గడ్డలు ఉన్నందున తక్షణమే దానిని తొలగించాలని (Hysterectomy) చెప్పారు. వైద్యుల మాటలను నమ్మిన కుటుంబ సభ్యులు ఆపరేషన్‌కు అంగీకరించారు.

inline-img

కోమాలోకి బాధితురాలు – హైదరాబాద్‌లో మృతి

ఆసుపత్రి యాజమాన్యం సుజాతకు శస్త్రచికిత్స పూర్తి చేసిన కొద్దిసేపటికే ఆమె పరిస్థితి విషమించి కోమాలోకి జారుకుంది. ఆపరేషన్ సమయంలో వైద్యులు తప్పుడు పద్ధతులు పాటించడం, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆమె కోమాలోకి వెళ్లిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి చేదాటడంతో సదరు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ తరలించారు. అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొనఊపిరితో చికిత్స పొందుతూ సుజాత గురువారం కన్నుమూసింది.

పోలీసుల ముందస్తు నిరోధం – రెండు చోట్లా ధర్నాలు

మృతురాలి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుండి షాద్ నగర్ కు తరలిస్తున్న తరుణంలో, సదరు ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఉద్రిక్తత చోటుచేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు పట్టణ శివార్లలోనే అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. ముందస్తు చర్యగా బాధితులను అదుపులోకి తీసుకుని, శవాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు.. తమకు అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వ ఆసుపత్రి ముందే బైఠాయించి నిరసనకు దిగారు.

మరోవైపు ఈ ఘోరం గురించి తెలుసుకున్న స్థానికులు, మరికొందరు బాధితులు నేరుగా జీహెచ్ఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న సదరు ప్రైవేట్ ఆసుపత్రి ముట్టడికి యత్నించారు. రెండు చోట్లా బాధితులు పెద్ద సంఖ్యలో చేరి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. మహిళ మృతికి కారణమైన డాక్టర్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శవంతో ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు నిరాకరించారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నప్పటికీ, బాధితులు మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఘటనా స్థలానికి అదనపు పోలీస్ బలాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Updated: 10 Jul 2026 | 12:46 PM IST