హైదరాబాద్: విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ ప్రభావంతో ఉస్మానియా యూనివర్సిటీ (OU) కీలక ప్రకటన చేసింది. రేపు (జులై 24, 2026) జరగాల్సిన అన్ని రకాల ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారికంగా వెల్లడించారు. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులు, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వివిధ కోర్సుల కింద జరగాల్సిన థియరీ, ప్రాక్టికల్ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి.
త్వరలోనే సవరించిన షెడ్యూల్
వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన సవరించిన తేదీలను (Revised Time Table) త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని వర్సిటీ యంత్రాంగం తెలిపింది. ఈ మార్పును యూనివర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ, ప్రాంగణ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, చీఫ్ సూపరింటెండెంట్లు, విద్యార్థులు గమనించాలని సూచించారు.


