హెల్త్ డెస్క్: భారతీయ సాంప్రదాయ వంటిల్లే ఒక అద్భుత ఔషధాలయం అని మరోసారి రుజువైంది. పోపులపెట్టెలో నిత్యం వాడే దినుసులతోనే మధుమేహం లాంటి దీర్ఘకాలిక మహమ్మారిని కట్టడి చేయవచ్చని తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (NIN) పరిశోధనలో తేలింది. డయాబెటిస్ బాధితుల్లో వచ్చే అనుబంధ ఆరోగ్య సమస్యలను నివారించేలా శాస్త్రవేత్తలు ఒక సరికొత్త పాలి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్‌ను విజయవంతంగా అభివృద్ధి చేశారు.

ఐదు దినుసుల అద్భుత మిశ్రమం

​ఈ సరికొత్త పరిశోధనపై ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ జి. భానుప్రకాష్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. మన వంటింట్లో లభించే అల్లం, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఉసిరి, పసుపు అనే ఐదు రకాల పదార్థాల మిశ్రమం ఆధారంగా ఈ హెర్బల్ ఔషధాన్ని తయారు చేశారు.

​సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా పోగుపడినప్పుడు 'అల్డోస్ రిడక్టేజ్' అనే ఎంజైమ్ దానిని సార్బిటాల్‌గా మారుస్తుంది. కణాలలో పేరుకుపోయే ఈ సార్బిటాల్ కారణంగానే డయాబెటిస్ రోగులలో నరాలు దెబ్బతినడం (న్యూరోపతి), మూత్రపిండాల వ్యాధులు (నెఫ్రోపతి), చూపు మందగించడం (రెటినోపతి), కంటి శుక్లాలు రావడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ ఐదు దినుసుల హెర్బల్ మిశ్రమానికి సదరు ఎంజైమ్‌ను సమర్థవంతంగా నిరోధించే శక్తి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

రెండేళ్లలో మార్కెట్లోకి అందుబాటులోకి..

​ఈ ఔషధం అభివృద్ధి కోసం ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు దాదాపు 15 ఏళ్లుగా సుదీర్ఘ పరిశోధనలు సాగిస్తున్నారు. ఊబకాయం, అధిక బరువు ఉన్న ఎలుకలపై ఇప్పటికే ఈ హెర్బల్ ఔషధాన్ని ప్రయోగించగా అద్భుతమైన సత్ఫలితాలు వచ్చాయి. ఎలుకలలో రెటినోపతి, నెఫ్రోపతి వంటి తీవ్ర సమస్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు పరిశోధనలో తేలింది.

​ఈ ప్రతిష్టాత్మక పరిశోధనకు సంబంధించి ఇప్పటికే 30కు పైగా పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. తదుపరి దశలో భాగంగా మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే మరో రెండు సంవత్సరాలలో ఈ హెర్బల్ ఔషధం మార్కెట్లో సాధారణ రోగులకు అందుబాటులోకి రానుంది.

Read latest Health News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST